భగవద్గీత
౧. భారతీయుల ప్రతిగృహంలోనూ ఉండవలసిన గ్రంథం భగవద్గీత ! “ఎవరు చదువుతారులే” అనే మీమాంసకు తావు ఇవ్వకుండా, ఆ పుస్తకం కొనటం, ఇంట్లో రోజూ కంటబడేచోట ఉంచటంకూడ, మన జాతీయ, సాంస్కృతిక స్వాభిమానానికి (Self-Respect)కి మొట్టమొదటి చిహ్నం అనే స్పృహను పెంచుకోవాలి.
౨. గీతలో 17వ అధ్యాయం (శ్రద్ధాత్రయ విభాగ యోగః) బాలశిక్షకు ప్రారంభం. మానవులను గుణాలనుబట్టి ఉత్తమ – మధ్యమ – అధమ అనే మూడు రకాలుగా విభజించి చూపాడు జగద్గురువైన శ్రీకృష్ణుడు అని తెలిపాడు జగద్గురు వ్యాసమహర్షి !
౩. అవి సాత్త్విక, రాజసిక, తామసిక గుణాలు. అందరిలోనూ కూడా మూడు గుణాలూ కలిసే ఉంటాయి – వేరు వేరు పాళ్ళలో.
౪. ఏయే గుణాలు కలవారు ఏయే పనులను ఏయే దృక్పథంతో ఏయే విధంగా చేస్తారో ఈ 17వ అధ్యాయంలో చెప్పబడింది. పనులు చేసేటప్పుడు – మన దృక్పథం (Outlook), ఉద్దేశము (Motive), పద్ధతి (Method)లను బట్టి, మన స్థాయి (సత్త్వ, రజస్, తమస్సులలో) ఎక్కడ ఉందో మనమే తెలుసుకోగల Ready Reckoner ఇది !
౫. భారతీయుల సంస్కృతికి ముఖ్యాంశాలైన ఐదింటిని గూర్చి ఈ విభాగం చేశారు. 1.దేవపూజ, 2.ఆహారం, 3.యజ్ఞం (=సరియైన మేఘాలను సృష్టించటంద్వారా ప్రకృతి శక్తుల సంతులనం), 4.తపస్సు (=ఏకాగ్ర మనస్సుతో అభీష్ట విషయ నిరంతర పరిశోధన); 5.దానం ( ఐచ్ఛికంగా సంపద వికేంద్రీకరణా విధానం; Have-Nots కి Haves మానవతా దృష్టితో సహాయమందించే అద్భుత వ్యవస్థ) – ఈ అయిదు అంశాలను సాత్త్విక రాజసిక తామసిక పదతులుగా విభజించారు.
౬. వీటిలో మరీ ముఖ్యమైనవి – అంటే మొదట తెలుసుకోవలసినవి – ఆహారం, తపస్సు ( మానసిక తపస్సు, వాచిక తపస్సు, శారీరిక తపస్సు ), దైవపూజావిధానం.
కాబట్టి ప్రాథమిక విద్యార్థి దశలోనున్న మన పిల్లలకు మనం నేర్పవలసినది – ఈ 17వ అధ్యాయపు ఒక్కో శ్లోకం చదివి వినిపించటం, డాని తాత్పర్యాన్ని క్లుప్తంగా పుస్తకంలోనున్నదానిని చదివి వినిపించటం, మనకున్న లోకానుభవంతో – ఆ విషయం ఈనాటి పరిస్థితులలో ఎట్లా అన్వయించుకోవాలో వివరించటం ! వారిలో ఈ విషయాలపై ఆదరణాభావం కలిగించటం, ఆచరణాత్మక దృష్టిని రగిలించటం – ఇంతే మనం చేయవలసినది. మిగిలింది పైవాడూ వాళ్ళే చూసుకుంటారు !
ప్రతివారూ ఇప్పుడున్న మెట్టుమీద (స్థితి) నుంచి ఒక్కమెట్టు పైకిఎక్కినా, పురోగతి చెందినట్లే గదా ! లక్ష్యానికి దగ్గరౌతున్నట్లే గదా ! దానికి భగవద్గీత చేసే సాయం ఇంతా అంతా కాదు !
No comments:
Post a Comment